సకల విఘ్నాలను తొలగించి, సర్వ కార్యాలలో విజయాన్ని ప్రసాదించే ప్రథమ పూజ్యుడు శ్రీ మహాగణపతి. విఘ్నేశ్వరుడు జన్మించిన పరమ పవిత్రతిథి భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి (భాద్రపద శుద్ధ చవితి) నాడు ‘వినాయక చవితి’ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్త హిందూ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహపూరిత ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకుంటుంది. సమస్త శుభకార్యాల ప్రారంభంలోనూ ముందుగా గణపతిని పూజించడం భారతీయ సనాతన సంప్రదాయం. మట్టి గణపతిని ప్రతిష్ఠించి, ఔషధ గుణాలున్న 21 రకాల పత్రాలతో (ఏకవింశతి పత్రి) పూజించి, ఉండ్రాళ్లు, కుడుములు నివేదించి, శమంతకోపాఖ్యాన వ్రతకథను పఠించి అక్షింతలు శిరస్సున ధరించడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం.
పురాణాల ప్రకారం పార్వతీదేవి తన శరీర నలుగుపిండితో ఒక బాలుడి రూపాన్ని తీర్చిదిద్ది ప్రాణప్రతిష్ఠ చేయగా, పరమశివుడి గణాధిపత్య పోటీలో ప్రపంచమంతా తిరిగే బదులు తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేసి సమస్త సృష్టిని దర్శించిన బుద్ధికుశలతకు మెచ్చి పరమేశ్వరుడు ఆయనను గణాధిపతి (గణపతి)గా నియమించిన రోజే భాద్రపద శుద్ధ చవితి. బాలగంగాధర్ తిలక్ ఈ పండుగను స్వాతంత్ర్యోద్యమ కాలంలో సామూహిక వేదికగా (సార్వజనిక్ గణేశోత్సవ్) మలచి దేశ సమైక్యతకు ఆయుధంగా మార్చారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రసాయనాలు లేని సహజసిద్ధమైన మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నవరాత్రుల పాటు లేదా తొమ్మిది, పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని అనంతచతుర్దశి నాడు అత్యంత వైభవోపేతంగా జలశయాలలో నిమజ్జనం చేస్తారు. ఈ సమగ్ర వ్యాసంలో వినాయక చవితి ఆవిర్భావ పురాణ నేపథ్యం, మట్టి గణపతి ప్రాముఖ్యత, ఏకవింశతి పత్రి విశిష్టత, పూజా విధానం, శమంతకమణి కథ మరియు నిమజ్జన తాత్వికతను సమగ్రంగా తెలుసుకుందాం.
వినాయక జననం మరియు గణాధిపత్యం
గణపతి ఆవిర్భావం: పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన నలుగుపిండితో రూపం చేసి ప్రాణం పోసి కాపలా ఉంచగా, వచ్చిన పరమశివుడిని ఆ బాలుడు అడ్డగించడంతో శివుడు ఆగ్రహించి శిరచ్ఛేదం చేశాడు.
గజానన రూపం: పార్వతీదేవి విలపించడంతో శివుడు ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్న ఏనుగు శిరస్సును (గజ ముఖం) తెప్పించి అతికించి ‘గజాననుడు’గా పునర్జీవితుడిని చేశాడు.
గణాధిపత్య పోటీ: కుమారస్వామి, గజాననుల మధ్య గణాధిపత్యం ఎవరికనే పోటీ రాగా, ముల్లోకాల్లోని నదులలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ పదవి దక్కుతుందని శివుడు తెలిపాడు.
మాతాపితృ ప్రదక్షిణ వైభవం: కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరగా, గజాననుడు “తల్లిదండ్రులే సమస్త విశ్వం” అనే భావనతో శివపార్వతులకు మూడు ప్రదక్షిణలు చేసి నారాయణ మంత్ర సాధనతో సర్వ తీర్థాల ఫలితాన్ని ముందుగా పొంది ‘గణపతి’గా సర్వగణాధ్యక్షుడయ్యాడు.
విఘ్నాల నివారించే స్వామి
‘విఘ్నేశ్వరుడు’. విఘ్నం అంటే అంతరాయం — అవాంతరాలను తొలగించి భక్తుల కార్యసిద్ధికి దారులు తెరవడమే స్వామివారి తత్వం. పురాణాలయిన గణేశ, ముద్గల, బ్రహ్మ, బ్రహ్మాండ పురాణాలు విఘ్నేశ్వరుని విభూతులను విశదీకరిస్తున్నాయి. భక్తజనం గణనాథుని ‘గణాధ్యక్షా, విఘ్నరాజా, మహాబలా, విశ్వ నేత్రా, ఆశ్రితవత్సలా, సర్వసిద్ధిప్రదా, అభీష్టవరదా’ అంటూ అర్చిస్తారు. వేదాలు, ఉపనిషత్తులు, శతకాలు, ప్రబంధాలు ఆయన మహిమను గర్వంగా తెలియజేస్తున్నవి .
సాంస్కృతిక ఐక్యత
వినాయక చవితి రోజున ఊరూవాడా, బస్తీ, బస్తీ…. భక్తి చైతన్యంలో తేలిపోతుంది. మండపాలు, వీధులు, శ్రావ్యభక్తిపాటలతో మారుమోగుతాయి. యువజన సంఘాల నిర్వహణలో విశిష్టంగా నిర్వహించబడే విఘ్నేశ్వర పూజలు, శ్లోక పారాయణ, భజనలు, నృత్య గీతాలు, వినూత్న ఆరాధనలు సాంస్కృతిక ఐక్యతకు అద్దంపడతాయి. విజ్ఞప్తుల్లాంటి ప్రార్థనల మధ్య స్వామిని ఘనంగా నిమజ్జనం చేస్తారు. ‘గణపతి బప్పా మోరియా!’, ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ!’ నినాదాలు గగనతలాన్నే తాకుతాయి. స్వామికి నూతన వస్త్రాలు, లడ్డూలు, పండ్లు సమర్పించి హారతులతో నిమజ్జనానికి తీసుకెళతారు. ఇది అభిషేకసూచకం మాత్రమే కాక, భక్తుల తాత్త్విక తపస్సుకూ ముగింపు సంకేతం.
పరమార్థ సందేశం
‘నేలతో కూడిన ప్రకృతిని మనం ఎంత పరిరక్షించు కుంటే, అంత ఉత్తమ ఫలితం మనకు ప్రాప్తిస్తుంది’ అని వినాయక చవితి నొక్కి చెబుతుంది. పత్రి ఔషధ గుణాలు, మట్టి విగ్రహాల విశిష్టత, ఉండ్రాళ్లు కుడుముల వంటి నైవేద్యాల ప్రత్యేకత – అన్నీ కలిపి ఈ పండుగను ఆధ్యాత్మిక మేళవింపుగా మలుస్తాయి. పూజలతో ప్రారంభించి, నిమజ్జనంతో ముగిసే ఈ దివ్యోత్సవం మన జీవితాల్లో విజయానికి, శ్రేయస్సుకు మార్గాన్ని వేస్తుంది. వినాయకుని కరుణా కటాక్షంతో విజయవంతమైన, సంపూర్ణ జీవితం గడపాలని కోరుకుందాం.
విదేశాల్లో వినాయకుడు
భారత పుణ్యభూమి నుంచి వినాయకుడు అనతి కాలంలోనే సముద్రాలకు ఆవల ఉన్న పలు ఇతర దేశాలకూ విస్తరించాడు. నౌకా వాణిజ్య సంబంధాల కారణంగా వినాయకుని ఆరాధన విదేశాలకూ పాకింది. చైనాలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే వినాయకుని ఆరాధన ఉండేదనేందుకు అక్కడ దొరికిన గణపతి శిల్పాలే నిదర్శనం. గణపతి ఆరాధన క్రీస్తుశకం ఐదు-ఆరు శతాబ్దాల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినా, దీనికి మూలాలు సింధులోయ నాగరికత కాలంలోనే ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇరాన్‌లోని లోరెస్తాన్ ప్రావిన్స్‌లో జరిపిన తవ్వకాల్లో దొరికిన లోహఫలకంపై గణపతిని పోలిన ఆకారం ఉండటంతో గజాననుడి ఆరాధనకు మూలాలు క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల కిందటే ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వైదిక సాహిత్యాన్ని తీసుకుంటే రుగ్వేదంలో వినాయకుని ప్రస్తావన ‘బ్రాహ్మణస్పతి’ అనే పేరిట కనిపిస్తుంది. కృష్ణ యజుర్వేదంలోనూ, తైత్తరీయ అరణ్యకంలోనూ కూడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వమే ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు కూడా గణపతి… ఆరాధనను స్వీకరించాయి. ఈ మతాలు వ్యాపించిన దేశాల్లో కూడా గణపతి ఆరాధన విభిన్నమైన విలక్షణమైన పద్ధతుల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. హేరంబ రూపంలోని వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. హేరంబుని వాహనం సింహం. నేపాల్, టిబెట్‌లలో నృత్యముద్రలో ఉన్న గణపతిని కూడా ఆరాధించేవారు. శ్రీలంక, బర్మా, చైనా, జపాన్, ఇండోనేసియా, మలేసియా, కంబోడియా దేశాల్లో కూడా వినాయకుడు విలక్షణ రూపాల్లో కనిపిస్తాడు. జైన గ్రంథాలలో వినాయకుని ప్రస్తావన లేకున్నా, జైనులు మాత్రం వినాయకుడిని ఆరాధిస్తారు. జైనులు తమ సంప్రదాయంలో గణజైనులు తమ సంప్రదాయంలో గణేశునికి కొన్ని కుబేరుని లక్షణాలను ఆపాదించినట్లు కనిపిస్తుంది. బౌద్ధ గ్రంథాలలో అక్కడక్కడా గణపతి ప్రస్తావన కనిపిస్తుంది.
విశ్వ వినాయకుని ఆరాధన తత్వాన్ని అర్థం చేసుకుని సృష్టి ఏకత్వంకై కృషి చేద్దాం. వైవిధ్యం వెనుక ఏకాత్మత భావం ఉంది. పంచ భూత పరిరక్షణ సూత్రం ఉంది. ఆధునిక యుగ పరివర్తన కాలంలో పరమార్థాన్ని నవ తరానికి అందిస్తూ దేశ ధర్మ సంస్కృతి సభ్యతలను నిలబెడుదాం.
@ (కలం) భారతి, 9949394688


