సిరిసిల్ల, అక్టోబర్ 16: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలో గాయపడి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టులు పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్‌లను రాజన్న ప్రెస్ క్లబ్ (సిరిసిల్ల) అధ్యక్షుడు కొంపెల్లి మహేష్ శుక్రవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, బాధితులకు ప్రెస్ క్లబ్ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా బాధిత జర్నలిస్టులు మాట్లాడుతూ, ఈ నెల 12న తమపై జరిగిన దాడి అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలో చోటుచేసుకున్న నేరెళ్ల ఘటన తరహాలోనే మరోసారి జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడం గర్హనీయమని పేర్కొన్నారు.
అనంతరం కొంపెల్లి మహేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజం రంగంపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టులపై వేధింపులు, దాడులు ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు జిల్లాలోని జర్నలిస్టు సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.


