చారిత్రక శిల్పకళా సంపదను సందర్శించిన వెల్దుర్తి విద్యార్థులువెల్దుర్తి, నవంబర్ 3 :విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని విషయాలతో పాటు తమ చుట్టూ ఉన్న చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వెల్దుర్తిలోని అద్భుత శిల్పకళా సంపదను సందర్శించేందుకు విద్యార్థులను తీసుకెళ్లినట్లు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య తెలిపారు.పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని, విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య ఆధ్వర్యంలో ఈ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అక్కడి శిల్పాల అందాలను, వాటిపై చెక్కిన అద్భుతమైన కళారూపాలను ఆసక్తిగా పరిశీలించారు. మన పూర్వీకుల కళానైపుణ్యం, సృజనాత్మకత, ఆనాటి సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. పుస్తకాల్లో చదివిన చారిత్రక అంశాలను ప్రత్యక్షంగా చూడటంతో విద్యార్థులకు ఎంతో విజ్ఞానం, ఆనందం కలిగాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సాంబయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని, తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఉన్నత విద్యను అభ్యసించి నచ్చిన రంగంలో ఉద్యోగాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఎవరూ తక్కువగా చూడకూడదని, వారికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తగిన ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. పాఠశాల నుంచి ఒక విద్యార్థి ఉన్నత ఉద్యోగాన్ని సాధించినా ఆ గ్రామానికి, తల్లిదండ్రులకు ఎంతో పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగు భాషా ఉపాధ్యాయులు అర్చన, విజయ్ మోహన్, ఖదీర్ పాషా, ఉపాధ్యాయులు వెంకటస్వామి, రాము తదితరులు పాల్గొన్నారు.



