సరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, నియోనాటాలజిస్ట్, సరయు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ తడుక సాయికుమార్ ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నిర్వహించిన అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్‌కేర్ (AMPH) విజయవంతంగా పూర్తి చేశారు.భారతదేశంలో అగ్రగామి బిజినెస్ స్కూల్‌గా, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన ISB, ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ MBA ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానం, భారతదేశంలో మొదటి స్థానం, ఆసియాలో రెండో స్థానం సాధించడం విశేషం.ఆరోగ్య రంగంలో నాయకత్వ లక్షణాలు, ఆసుపత్రుల నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, వ్యూహాత్మక నిర్ణయాలు, వైద్య సేవల నాణ్యత, ఆధునిక హెల్త్‌కేర్ విధానాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, హెల్త్‌కేర్ రంగ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.2026 నవంబర్ 14న మొహాలీలోని ISB క్యాంపస్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్, IAS ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికుమార్‌కు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు.వైద్య వృత్తిలో నిరంతర అభ్యాసంతో పాటు ఆధునిక హాస్పిటల్ మేనేజ్‌మెంట్, సాంకేతిక పరిజ్ఞానం, నూతన నిర్వహణ పద్ధతులను అనుసంధానం చేసి సిరిసిల్ల ప్రాంత ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కోర్సును పూర్తి చేసినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా పలువురు వైద్యులు, కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు.


